Rail Kaushal Vikas Yojana : ఇండియన్ రైల్వే.. రైల్ కౌశల్ వికాస్ యోజన (Rail KVY) పేరుతో శిక్షణా కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రెయినింగ్ ఇవ్వనుంది. నిరుద్యోగులు వారి ఆసక్తిని బట్టి ట్రైనింగ్ పొందవచ్చు. శిక్షణ తరువాత స్వయం ఉపాధికి కూడా అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రైల్వేలో టెక్నికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ సమయంలో ప్రాధాన్యత ఉంటుంది. ఇతర సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. వివరాల్లోకెళ్తే...
దేశ యువత స్వయం సాధికారతను సాధించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన స్కీమ్ రైల్ కౌశల్ వికాస్ యోజన (Rail KVY). స్థానిక యువతకు స్కిల్ ట్రైనింగ్ అందించే ఉద్దేశంతో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ 'రైల్ కౌశల్ వికాస్ యోజన' (Rail Kaushal Vikas Yojana - Rail KVY) పథకానికి శ్రీకారం చుట్టింది. నాలుగు అంశాల్లో మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో ఉచితంగా శిక్షణ అందిస్తారు. అది పూర్తయ్యాక ప్లేస్‌మెంట్ కల్పిస్తారు. ఎవరైనా స్వయం ఉపాధి పొందాలనుకున్నా అందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తారు.
Rail KVY శిక్షణ పూర్తిగా ఉచితం :
దేశవ్యాప్తంగా రైల్వేలకు చెందిన 75 సంస్థలు శిక్షణను అందిస్తాయి.
మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అనే నాలుగు ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తారు. జోనల్ అవసరాలకు తగిన విధంగా భవిష్యత్తులో ఇతర విభాగాలకు కూడా శిక్షణను విస్తరించాలని అనుకుంటున్నారు.
మారుమూల ప్రాంతాలలోని యువతకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా మొబైల్ యూనిట్ల ఏర్పాటు ఆలోచన కూడా ఉంది.
ఇది మొత్తం వంద గంటలు లేదా మూడు వారాల శిక్షణ కార్యక్రమం. ఇందులో ప్రాక్టికల్, థియరీ రెండూ ఉంటాయి.
రైల్వే విభాగంలో ఉపయోగపడే ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షణ ఇస్తారు.
భారతీయ రైల్వేలో అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తారు. లేదా ఆ రంగంలోని వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు చూపిస్తారు.
ఎవరైనా సొంతంగా ఉపాధి పొందాలనుకుంటే వాళ్ల అవసరాలను బట్టి సహాయం అందిస్తారు. టూల్ కిట్లు ఇవ్వడం, లోన్లు తీసుకోవడంలో అధికారులు సాయం చేస్తారు.
మూడేళ్లలో 50 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అర్హతలు- నిబంధనలివే :
పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు ఉన్న అభ్యర్థులు అర్హులు.
భారతీయ పౌరులై ఉండాలి.
మంచి ఫిట్‌నెస్ ఉండాలి. రిజిస్టర్డ్ ఎంబీబీఎస్ వైద్యుడి నుంచి చూపు, వినికిడి, మానసిక ఆరోగ్యం బాగున్నాయనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ దరఖాస్తు పత్రంతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఎలాంటి అంటువ్యాధులు లేవనే ధ్రువీకరణ కూడా అవసరం.
మెట్రిక్యులేషన్ (పదో తరగతి)లో వచ్చిన మార్కుల ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు.
ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు.
అప్లికేషన్లు ఆన్‌లైన్లో కూడా తీసుకుంటారు.
శిక్షణ ముగిసిన తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 'నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇనిస్టిట్యూట్' సర్టిఫికేట్లను అందజేస్తుంది.
Rail KVY నోటిఫికేషన్ విడుదలైనప్పుడు అప్లయ్ చేసుకోవాలి.
శిక్షణ విధానం:
రైల్ కౌశల్ వికాశ యోజన (Rail KVY) నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమం. రైల్వే మంత్రిత్వశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ కింద దీన్ని అందిస్తున్నారు. శిక్షణలో భాగంగా స్టైపెండ్, ఇతర అలవెన్సుల లాంటివేమీ ఇవ్వరు. ఈ స్కీము కింద రిజర్వేషన్లు లేవు. కుల,మతం, జాతి, తెగ ఇలాంటి తేడాలు లేకుండా శిక్షణను అందిస్తారు. ఒక ట్రేడ్‌లో ఒక పర్యాయం మాత్రమే అభ్యర్థిని అనుమతిస్తారు. ట్రైనింగ్‌లో కొనసాగడానికి, సర్టిఫికేట్ పొందడానికి 75 శాతం హాజరు తప్పనిసరిగా అభ్యర్థికి ఉండాలి. శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే సర్టిఫికేట్లు అందజేస్తారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు యువతకు ఈ స్కీము డిజైన్ చేశారు.
Whatsapp Group Link:
0 comments:
Post a Comment