ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్నవారికి ఇండియన్ ఆర్మీ ఆహ్వానం పలుకుతోంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విధానంలో 196 టెక్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.అవివాహిత మహిళలు, పురుషులు వీటికి పోటీపడవచ్చు. ఇంటర్వ్యూతో శిక్షణకు తీసుకుంటారు. దీన్ని పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమానూ అందిస్తారు. వీరు లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఆకర్షణీయ వేతనం, ప్రోత్సాహకాలూ అందుకోవచ్చు.
ప్రకటించిన మొత్తం 196 ఖాళీల్లో..
పురుషులకు 175, మహిళలకు 19, ఆర్మీ విడోలకు 2 కేటాయించారు. పురుషుల ఖాళీల్లో విభాగాలవారీగా చూస్తే.. సివిల్ 47, కంప్యూటర్ 42, ఎలక్ట్రికల్ 17, ఎలక్ట్రానిక్స్ 26, మెకానికల్ 34, ఇతర విభాగాలు 9 ఉన్నాయి. మహిళలకు సంబంధించి సివిల్ 4, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 6, ఎలక్ట్రికల్ 2, ఎలక్ట్రానిక్స్ 3, మెకానికల్ 4 ఉన్నాయి.
ఎంపిక
దరఖాస్తులను గ్రాడ్యుయేషన్ (బీటెక్) మార్కుల ఆధారంగా వడపోస్తారు. ఇలా అవకాశం వచ్చినవారిని సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఏపీ, తెలంగాణ అభ్యర్థులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. రెండు దశల్లో ఐదు రోజులు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్-1లో ఉత్తీర్ణులే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్-2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయం సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు.
విద్యార్హత: సంబంధిత/ అనుబంధ విభాగాల్లో ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. డిఫెన్స్ విడో ఖాళీల్లో ఒక పోస్టుకు ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు, మరొకదానికి ఇంజినీరింగ్ అభ్యర్థులు పోటీపడవచ్చు.
వయసు: ఏప్రిల్ 1, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్ 2, 1997 - ఏప్రిల్ 1, 2004లోగా జన్మించినవారు అర్హులు. ఆర్మీ విడోల గరిష్ఠ వయసు 35 ఏళ్లకు మించరాదు.
శిక్షణ.. వేతనాలు
వీరికి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ చెన్నైలో ఏప్రిల్, 2024 నుంచి శిక్షణ మొదలవుతుంది. దీని వ్యవధి 49 వారాలు. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ అందిస్తుంది. వీరిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. పదేళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అనంతరం సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత విధుల్లోకి (పర్మనెంట్ కమిషన్) తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. అనంతరం వీరు వైదొలగాలి. లెఫ్టినెంట్ విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల అనుభవంతో మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. ఉద్యోగంలో రూ.56,100 (లెవెల్ 10) మూలవేతనంతోపాటు మిలటరీ సర్వీస్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు. పలు ప్రోత్సాహకాలూ దక్కుతాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జులై 19 మధ్యాహ్నం 3 గంటల వరకు
వెబ్‌సైట్: https://www.joinindianarmy.nic.in/
0 comments:
Post a Comment