రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. భారతీయ రైల్వే 35 వేలకు పైగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ను నిర్వహించనుంది. భారతీయ రైల్వే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ లో భాగంగా మొత్తం 35,281 ఖాళీలను భర్తీ చేయనుంది. 2023 మార్చి నెలాఖరుకల్లా ఈ నియామకాలను చేపట్టనున్నట్లు భారతీయ రైల్వే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ తెలిపారు. 2019 సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీస్ ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. వివిధ స్థాయిల ఫలితాలను వేరువేరుగా పొందేందుకు రైల్వే సిద్ధమవుతుందని, కాబట్టి ఎక్కువ సంఖ్యలో రైల్వే ఉద్యోగాలకు అవకాశం ఉందని అన్నారు.
ఒకేసారి అన్ని స్థాయిల పరీక్షల ఫలితాలను విడుదల చేయకపోవడంపై.. అమితాబ్ శర్మ స్పందిస్తూ.. ఒకేసారి అన్ని ఫలితాలూ విడుదల చేయడం వల్ల చాలా మంది అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతున్నారని అన్నారు. ఒకే పరీక్ష ఫలితం విధానంతో ఒకే దరఖాస్తుదారు వేర్వేరు పోస్టులకు అర్హత పొందుతున్నారని.. ఈ కారణంగా అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ ప్రయోజనాలను కోల్పోతున్నారని అన్నారు. అలా కాకుండా అన్ని స్థాయిల ఫలితాలను విడివిడిగా వెల్లడించడం ద్వారా ఎక్కువమంది అర్హులు ఉద్యోగ అవకాశం పొందే వీలు ఉంటుందని అమితాబ్ శర్మ తెలిపారు. ఈ భర్తీల ప్రక్రియకి మూడు నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి నిరుద్యోగ యువతకి ఇది శుభవార్త అనే చెప్పవచ్చు.
0 comments:
Post a Comment