రామచంద్రపురం ఈ నెల 20వ తేదీన నిర్వహించే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విజ్ఞప్తి చేశారు.
సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రముఖ ఐటి, ఫార్మసి కంపెనీలు 30 పాల్గొని మెగా జాబ్ మేళాను వికాస ఆధ్వర్యంలో స్థానిక విఎస్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొంతవరకు చదువుకుని వివిధ కారణాల మూలంగా మధ్యలో విద్యను నిలిపివేసిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. నిరుద్యోగ యువత అర్హతలకు తగ్గ ఉద్యోగ అవకాశాలను అందించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తూ తమ కాళ్లపై తాము నిలబడి జీవించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ప్రముఖ ఐటి, ఫార్మపీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో తమ వంతు సహకారాన్ని అందించి తమ కంపెనీల్లో అవసరమైన మానవ వనరులుగా వినియోగించు కునేందుకు సిద్ధమవడం సంతోషదాయకమన్నారు. వికాస సంస్థ ద్వారా ప్రతి నియోజకవర్గంలోను మెగా జాబ్ మేళాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్ , ఐటిఐ, డిప్లమో ఏదైనా డిగ్రీ, బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినవారు అర్హులని, 35 ఏళ్ల లోపు వయసు కలిగిన నిరుద్యోగ యువత అర్హులని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కార్యాఃచరణ రూపొందించినట్టు తెలిపారు. 1,859 ఉద్యోగాల భర్తీతో మంచి ఉద్యోగావకాశాలను అందపుచ్చుకోవాలని తెలిపారు.
గ్రామాల్లో నిరుద్యోగ యువత అధికంగా ఉందని, వీరు పెడదోవ పట్టకుండా మంచి అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం వికాస సంస్థ కలిసి నడవడం ఆనందదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా నైపుణ్య గణన చేపట్టిందని దానిలో భాగంగానే 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలను కల్పించాలని సంకల్పించిందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కడియాల రాఘవన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వికాస ప్రతినిధులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment