UPSC NDA & NA (1)-2023 Notification: ఇంటర్‌తోనే.. డిగ్రీ+కొలువు

ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షలో విజయం సాధించి.. ఆ తర్వాత మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలు వేర్వేరుగా నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ప్రక్రియలోనూ నెగ్గి తుది విజేతలుగా నిలిస్తే.. అభ్యర్థులు ఎంచుకున్న విభాగంలో పర్మనెంట్‌ కమిషన్‌ హోదాతో కొలువు ఖాయమైనట్లే! యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షను నిర్వహిస్తుంది.

మొత్తం పోస్టుల సంఖ్య 395

ఎన్‌డీఏ,ఎన్‌ఏ(1)-2023 ఎంపిక ప్రక్రియ ద్వారా.. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో మొత్తం 395 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో భాగంగానే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లకు వేర్వేరుగా ఖాళీలను ప్రకటించారు. ఆర్మీ విభాగం-208 ఖాళీలు, నేవీ-42, ఎయిర్‌ఫోర్స్‌ ఫ్లయింగ్‌ విభాగం-92, ఎయిర్‌ఫోర్స్‌ గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌)-18, ఎయిర్‌ఫోర్స్‌ గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌)లో-10 ఖాళీలు ఉన్నాయి.
నేవల్‌ అకాడమీ(10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌)లో-25(పురుష అభ్యర్థులకు మాత్రమే) ఖాళీలు ప్రకటించారు.

వేతనం

శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిఫండ్‌ లభిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకొని సర్వీసులో చేరిన వారికి పే లెవల్‌ 10తో రూ.56,100-1,77,500 వేతన శ్రేణి అందుతుంది.

అర్హతలు

ఆర్మీ వింగ్‌: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత ఉండాలి.
ఎయిర్‌ఫోర్స్, నేవీ, నేవల్‌ అకాడమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్ట్‌లుగా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులవ్వాలి. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 24 డిసెంబర్‌ 2023 నాటికి సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది.
వయసు: జూలై 2, 2004-జూలై 1, 2007 మధ్య జన్మించి ఉండాలి.

రెండంచెల ఎంపిక ప్రక్రియ

ఎన్‌డీఏ, ఎన్‌ఏకు రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అవి..రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ. తొలి దశలో యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా.. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు దక్కిన వారికి తదుపరి దశలో సదరు విభాగాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఎస్‌ఎస్‌బీల ఆధ్వర్యంలో ప్రత్యేక పరీక్షలు ఉంటాయి. వీటిలోనూ ఉత్తీర్ణత సాధిస్తే త్రివిధ దళాల్లో పర్మనెంట్‌ కమిషన్డ్‌ ర్యాంకుతో శిక్షణ ఖరారవుతుంది.
శిక్షణ, డిగ్రీ సర్టిఫికెట్‌

ఎంపిక ప్రక్రియలోని రెండు దశల్లోనూ విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, నేవల్‌ అకాడమీల్లో శిక్షణ ఉంటుంది.
ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు సంబంధించి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పుణెలో, నేవల్‌ అకాడమీ అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్‌ అకాడమీలో శిక్షణనిస్తారు.
అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న విభాగాలను ప్రాధాన్యత క్రమంలో పేర్కొనాల్సి ఉంటుంది.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి బీఏ, బీఎస్సీ, బీటెక్‌ పట్టాలు కూడా అందజేస్తారు. అంటే.. ఒకే సమయంలో కొలువు, ఉన్నత విద్య రెండింటినీ సొంతం చేసుకునే అవకాశం ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష ద్వారా లభిస్తుంది.

మూడేళ్ల శిక్షణ

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ-పుణెలో మూడేళ్లపాటు శిక్షణ ఉంటుంది. మొదటి రెండున్నరేళ్లు అన్ని విభాగాల అభ్యర్థులకు కామన్‌గా శిక్షణ ఇస్తారు. చివరి ఆరు నెలలు మాత్రం అభ్యర్థులు ఎంపికైన విభాగం ఆధారంగా ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. ఇలా మొత్తం మూడేళ్ల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వారు ఎంపిక చేసుకున్న కోర్సు ఆధారంగా జేఎన్‌యూ-ఢిల్లీ నుంచి బీఏ, బీఎస్‌సీ, బీఎస్‌సీ (కంప్యూటర్‌ సైన్స్‌) డిగ్రీలను అందిస్తారు.
ఎయిర్‌ఫోర్స్, నేవల్‌ విభాగాలను ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న వారికి బీటెక్‌ చదివేందుకు అవకాశం ఉంటుంది. వీరు ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయాలి.

నేవల్‌ అకాడమీ.. ప్రత్యేక శిక్షణ

ఎన్‌ఏ, 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు ఎంపికైన వారికి నేవల్‌ అకాడమీ(ఎజిమల)లో నాలుగేళ్లపాటు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. ఆ తర్వాత వీరికి అప్లైడ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, నేవల్‌ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ బ్రాంచ్‌లలో ఏదో ఒక బ్రాంచ్‌తో బీటెక్‌ సర్టిఫికెట్‌ అందిస్తారు.

తొలి దశ.. రాత పరీక్ష

ఎన్‌డీఏ,ఎన్‌ఏ ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను రెండు పేపర్లలో మొత్తం 900 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌ 1 మ్యాథమెటిక్స్‌ 300 మార్కులకు,పేపర్‌ 2 జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ 600 మార్కులకు ఉంటాయి. ప్రతి పేపర్‌ పరీక్ష సమయం రెండున్నర గంటలు. పరీక్ష బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలోనే ఉంటుంది.
పేపర్‌-2గా నిర్వహించే జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో.. పార్ట్‌-ఎ పేరుతో 200 మార్కులకు ప్రత్యేకంగా ఇంగ్లిష్‌ విభాగం ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగం పేరుతో పార్ట్‌-బిని నిర్వహిస్తారు. పార్ట్‌-బికి 400 మార్కులుంటాయి.

పార్ట్‌-బి.. ఆరు విభాగాలు

పేపర్‌-2 పార్టీ బీని 400 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మొత్తం ఆరు విభాగాలు(ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమం, జాగ్రఫీ, కరెంట్‌ ఈవెంట్స్‌) నుంచి ప్రశ్నలడుగుతారు. ప్రతి విభాగానికి సంబంధించి నిర్దిష్టంగా వెయిటేజీని పేర్కొన్నారు. ఫిజిక్స్‌కు 25 శాతం, కెమిస్ట్రీకి 15 శాతం, జనరల్‌ సైన్స్‌కు 10 శాతం, హిస్టరీ, భారత స్వాతంత్య్రోద్యమానికి 20 శాతం, జాగ్రఫీకి 20 శాతం, కరెంట్‌ ఈవెంట్స్‌కు పది శాతం వెయిటేజీ కల్పించారు. ఈ వెయిటేజీ ప్రకారమే ఆయా విభాగాల్లో ప్రశ్నల సంఖ్య, మార్కులు ఉంటాయి.
పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే పేపర్‌-1, పేపర్‌-2లలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు.

ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ ఇలా

ఎన్‌డీఏ, ఎన్‌ఏ రాత పరీక్షలో విజయం సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు మలి దశలో మరో 900 మార్కులకు ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న సమయంలో పేర్కొన్న ప్రాథామ్యతలు, రాత పరీక్షలో పొందిన మెరిట్‌ ఆధారంగా.. నిర్దేశిత విభాగం ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌బీ (సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌) నిర్వహించే ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌లోనూ నెగ్గాల్సి ఉంటుంది.
ఎయిర్‌ఫోర్స్‌ విభాగాన్ని ప్రాథమ్యంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. ఎస్‌ఎస్‌బీ తర్వాత నిర్వహించే కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టమ్‌లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది.
ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల మానసిక, శారీరక ద్రుఢత్వాన్ని పరిశీలిస్తారు. ఇంటెలిజెన్స్‌ టెస్ట్, వెర్బల్‌ టెస్ట్, నాన్‌ వెర్బల్‌ లెస్ట్, సామాజిక అంశాలపై ఉన్న అవగాహన, తార్కిక విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షిస్తారు. అదే విధంగా పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్టన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇలా మొత్తం అయిదు రోజులపాటు ఈ ప్రక్రియ సాగుతుంది. ఇందులోనూ తుది జాబితాలో నిలిచిన వారికి ప్రాథమికంగా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ-పుణె, నేవల్‌ అకాడమీ(ఎజిమల)లో శిక్షణ ఉంటుంది.
ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 10, 2023
ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 16, 2023
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top